మాలలకు రోస్టర్‌ పాయింట్ల కేటాయింపులో న్యాయం చేయాలి!

కలం, మధిర: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మాలలకు రోస్టర్‌ పాయింట్ల కేటాయింపులో న్యాయం చేయాలని మాల మహానాడు మధిర పట్టణ కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్‌(Madhira MRO)కు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణలో గ్రూప్‌–III కేటగిరీలో ఉన్న మాలలకు 22వ రోస్టర్‌ పాయింట్‌ నుంచి కేటాయింపులు ఉన్నాయని కమిటీ నేతలు పేర్కొన్నారు. దీనివల్ల ప్రారంభ రోస్టర్‌ పాయింట్ల పరిధిలో మాలలకు తగిన అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రోస్టర్‌ విధానాన్ని సమీక్షించి, మాలలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రారంభ 10 రోస్టర్ పాయింట్లలో ఒక పాయింట్‌, 11 నుంచి 20 పాయింట్ల పరిధిలో మరో పాయింట్‌ మాలలకు కేటాయించేలా తమ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలని కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రస్తుత రిజర్వేషన్‌ నిబంధనలు, రోస్టర్‌ విధానం, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అన్ని వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు ప్రతినిధులు కోరారు. రిజర్వేషన్ల అమలులో ఎలాంటి అన్యాయం జరగకుండా, అర్హులైన అభ్యర్థులకు సముచిత అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు. తమ వినతిని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ ప్రభాకర్ రావు, మధిర (Madhira) పట్టణ మాల మహానాడు అధ్యక్షులు మోచర్ల సురేశ్​, మధిర నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు నల్లపు శేఖర్, మాల మహానాడు సభ్యులు గండమాల ప్రసాద్, రెంటపల్లి ఫ్రాన్సిస్, జూపూడి వెంకటేశ్వరరావు, గొఱ్ఱముచ్చు రమేశ్​, యమాల ప్రకాష్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు అధూరి అబ్రహం, వేల్పుల శ్రీనివాసరావు, రామాల సురేష్, వేల్పుల శివ పాల్గొన్నారు.

Also Read : తెలంగాణకు గుడ్‌న్యూస్.. 5 ప్రాంతాల్లో రోప్‌వేలు రయ్‌రయ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>