ఏపీని సౌత్ బీహార్‌గా చేసేస్తున్నారు.. షర్మిల విమ‌ర్శ‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (AP Local Body Election) జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల వేళ టీడీపీ, వైసీపీలు దాష్టీక రాజ‌కీయాలు సాగిస్తున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆమె ఓ పోస్ట్ చేశారు. స్థానిక ఎన్నిక‌ల్లో నాడు వైసీపీ హ‌యాంలో హింసాకాండ జ‌రిగింద‌ని, నేడు టీడీపీ పాల‌న‌లో కూడా అంత‌కుమించి దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఇరు పార్టీలు ప్ర‌తీకార రాజ‌కీయాల‌తో ర‌త‌నాల సీమ‌ను ర‌క్త‌సీమ‌గా మారుతున్నార‌ని మండిప‌డ్డారు. నిష్ప‌క్ష‌పాతంగా, ప్ర‌శాంతంగా జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను ఘ‌ర్ష‌ణ‌లు, దాడుల‌తో ర‌ణ‌రంగంగా మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. అన్న‌పూర్ణ‌లాంటి ఏపీని మ‌రో సౌత్ బీహార్‌గా మార్చే ప‌రిస్థితులు సృష్టిస్తున్నార‌న్నారు.

అధికారంతో టీడీపీ దౌర్జ‌న్యం

ఈ సందర్భంగా ష‌ర్మిల శుక్ర‌వారం రాయ‌చోటి, పుంగ‌నూరులో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించారు. రాష్ట్ర ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే అవి ఎంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిణామాల‌ని విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో క‌క్ష సాధింపు రాజ‌కీయాలు, ర‌క్త‌పాతానికి తావులేద‌ని, రాజ‌కీయాలంటే అభివృద్ధి కోసం పోటీ ప‌డాలి కానీ, భౌతిక దాడుల‌కు దిగ‌డం స‌రికాద‌ని ష‌ర్మిల అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ దౌర్జ‌న్యాన్ని సాగిస్తోంద‌ని, ఈ చ‌ర్య‌ల‌ను ఏపీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంద‌ని ష‌ర్మిల అన్నారు. కూట‌మిది నిజంగా ప‌విత్ర పాల‌న అయితే ఇన్ని దాడులు, బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు ఎందుకు అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. నామినేష‌న్లు వేయ‌డానికి వెళ్ల‌కుండా ఎందుకు అడ్డుకుంటున్నార‌ని నిల‌దీశారు.

ఎన్నిక‌ల‌ సంఘంపై విమ‌ర్శ‌లు

ఎన్నిక‌ల సంఘం తీరు పైనా ష‌ర్మిల (YS Sharmila) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదంచెల భ‌ద్ర‌త ఉండాల్సిన నామినేష‌న్ కేంద్రాల వ‌ద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైర విహారం చేస్తుంటే ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ఎందుకు కాపాడ‌టం లేద‌ని నిల‌దీశారు. ఎన్నిక‌ల సంఘం ముందు ష‌ర్మిల ఐదు డిమాండ్లు పెట్టారు. ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, ప్ర‌శాంతంగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాల‌ని డిమాండ్ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాల‌ని సూచించారు. ఎన్నిక‌ల‌తో సంబంధం లేని వారు, ఇతర ప్రాంతాల వ్య‌క్తులు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోక్యం చేసుకోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Also Read : నామినేషన్ల వేళ రణరంగం.. హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>