కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంతో పాటు బ్యాంకింగ్ తదితర సేవలను వినియోగించుకోవడానికి ఆధార్ కార్డు కీలకమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సేవలను వికేంద్రీకరిస్తోందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వర్నిరోడ్డులో కోటగల్లిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పక్కన, మున్నూరుకాపు సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని (New Aadhaar Seva Kendra) శనివారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో నకిలీ ఆధార్ నమోదు చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేంద్రం ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు.
ఆదివారాలు, రెండో శనివారం, పండుగ సెలవు రోజుల్లోనూ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఇతర పనుల్లో నిమగ్నమయ్యే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుఐడిఎఐ అసిస్టెంట్ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఇ గవర్నెన్స్ జిల్లా మేనేజర్ కార్తీక్ కుమార్, ప్రోటీన్ టెక్నాలజీస్ సంస్థ నిజామాబాద్ ఆధార్ సేవా కేంద్రం మేనేజర్ సురేష్ కుమార్, ఏ ఎస్ కే కామారెడ్డి జిల్లా మేనేజర్ అనిల్ కుమార్, ఆధార్ కేంద్రం ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

