కలం, దేవరకొండ: రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా వ్యవసాయానికి నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) అన్నారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం మేడారం గ్రామ పరిధిలోని రంగారెడ్డి గూడెంలో(Rangareddygudem) శనివారం రూ.2.10 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించడంతో పాటు, పీఏ పల్లి మండలానికి చెందిన పలువురు అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. రంగారెడ్డి గూడెం ప్రాంతంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనేది స్థానిక ప్రజలు, రైతుల పదేళ్లనాటి కల అని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కలను సాకారం చేశామని హర్షం వ్యక్తం చేశారు.
లో-వోల్టేజీ సమస్యలకు చెక్
నూతన సబ్స్టేషన్ అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల రైతులకు లో-వోల్టేజీ, అధిక లోడ్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలో ఉన్న రైతుల పంట పొలాల్లో విద్యుత్ సమస్యల వల్ల ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకూడదని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి పథకాలపై ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని, సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికీ అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, నాయకులు నెర్మటి సతీష్ రెడ్డి, ఏవీ రెడ్డి, సత్యం రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, ఎలూగూరి జయమ్మ, భాస్కర్ రెడ్డి, గొంగడాల వెంకటయ్య, రాగం అంజయ్య, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మావిల్ల లక్ష్మీనారాయణ యాదవ్, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, మద్దిమడుగు రామస్వామి, కొర్ర రాంసింగ్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

