కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్ట్‌తో తెలంగాణలో విద్యుత్ (Telangana Power) వినియోగం ఆల్‌టైమ్ రికార్డులు కొడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఈ నెల 15న ఉదయం 10:29 గంటలకు అత్యంత గరిష్ఠంగా 20,003 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యధిక డిమాండ్ 18,548 మెగావాట్లు కాగా, ఇప్పుడు ఆ రికార్డును దాటుకుని ఏకంగా 1,455 మెగావాట్లు అదనంగా పెరిగింది.రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, భూగర్భ జలాలు పడిపోతే.. వ్యవసాయ, గృహ అవసరాలకు విద్యుత్ డిమాండ్ ఊహకందని స్థాయికి చేరే ప్రమాదం ఉంది.
ఈ సవాలును ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతోంది. పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి తగ్గింపు, పునరుత్పాదక విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి చర్యలతో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. మరోవైపు, ‘పొలం బాట’ పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ విద్యుత్, నీటి పొదుపుపైనా దృష్టి పెట్టింది.
ఏసీలు 25 డిగ్రీలే..
విద్యుత్ పొదుపును ప్రభుత్వ కార్యాలయాల నుంచే ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 2026 ఫిబ్రవరి 17న జారీ చేసిన జీవో ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ వద్దే ఉంచాలి. అంతకంటే తక్కువకు తగ్గించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ వినియోగం, గరిష్ఠ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ఈ నిర్ణయం లక్ష్యం. ఈ చర్యలు ‘తెలంగాణ రైజింగ్–2047’ నెట్ జీరో లక్ష్య సాధనకు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే, అత్యవసర, నిర్దిష్ట సాంకేతిక అవసరాలున్న విభాగాలకు మినహాయింపు కల్పించింది.
200 కొత్త సబ్స్టేషన్లు..
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఓవర్‌లోడ్, తక్కువ వోల్టేజీ సమస్యల పరిష్కారంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. ఎల్ నినో ముప్పు అనే కాకుండా వేసవిలో సరఫరా అంతరాయాలు తలెత్తకుండా లైన్లు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను నిరంతరం పర్యవేక్షించనుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 200 కొత్త సబ్స్టేషన్లలో 150 పనులు ప్రారంభించగా.. మిగిలిన 50 నిర్మాణాలను త్వరలో చేపట్టనుంది.
ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న లోడ్‌ను తట్టుకునేందుకు టీజీఎస్పీడీసీఎల్ కొండాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ ప్రాంతాల్లో రూ.33.99 కోట్లతో మూడు 33/11 కేవీ ఇండోర్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో సబ్‌స్టేషన్ నుంచి ఆరు 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేయడంతోపాటు భూగర్భ కేబుళ్లు, కంట్రోల్ రూమ్‌లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్లింత్లు, అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, రక్షణ గోడలను నిర్మించనున్నారు.
స్టోరేజీతో పీక్ అవర్‌కు చెక్..
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో సమయానుసారంగా మార్పులు ఉండటంతో విద్యుత్ నిల్వ వ్యవస్థల (స్టోరేజ్) ఏర్పాటుకు ప్రాధాన్యం పెరిగింది. ఇందులో భాగంగా టీజీ రెడ్కో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులతోపాటు 1,000 మెగావాట్ల/6,000 మెగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయి. వీటితోపాటు 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు, 2,000 మెగావాట్ల రౌండ్ ద క్లాక్ (ఆర్టీసీ) ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ విద్యుత్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే పునరుత్పాదక విద్యుత్‌ను నిల్వ చేసి, డిమాండ్ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్‌లో వినియోగించుకునే వీలుంటుంది.
ఇంటెన్సివ్ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం..
వ్యవసాయ రంగంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో రైతుల సమస్యల పరిష్కారంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘పొలం బాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. వరి సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ మోటార్లు, సర్వీస్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో విద్యుత్, నీటి పొదుపుతోపాటు మోటార్ల వద్ద కెపాసిటర్ల ఏర్పాటు ప్రాధాన్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి, రోజువారీ వైఫల్యాలు సాధారణంగా 50 ఉండగా.. ప్రస్తుతం 100కు చేరుతున్నాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. పంటలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రెండు వారాల్లో ‘ఇంటెన్సివ్ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ విధానాన్ని’ తీసుకొస్తామని వెల్లడించారు.
రాష్ట్ర చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు..
రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. అక్టోబర్ 15న ఉదయం 10:29 గంటలకు నమోదైన ఈ డిమాండ్.. గత ఆర్థిక సంవత్సరం గరిష్ఠం (18,548 మెగావాట్లు) కంటే 1,455 మెగావాట్లు ఎక్కువ. ఇదే రోజు రాష్ట్ర విద్యుత్ వినియోగం 334.54 మిలియన్ యూనిట్లకు చేరింది. ఎల్ నినో కారణంగా ఏసీల వాడకం, వ్యవసాయ బోర్ల వినియోగం పెరగడంతోపాటు గృహ, పారిశ్రామిక అవసరాలు అధికం కావడం డిమాండ్ పెరుగుదలకు కారణమైంది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అక్టోబర్ 15న 12,281 మెగావాట్ల డిమాండ్ నమోదవగా, హైదరాబాద్ పరిధిలో గతేడాది గరిష్ఠం 3,552 మెగావాట్లను అధిగమించి 4,220 మెగావాట్లకు చేరింది.

