తగ్గని ‘బోరు’ గోస.. పెరిగిన కరెంట్ భారం!

కలం, తెలంగాణ బ్యూరో: వేల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినా, ఆయకట్టు పెంచడానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రభుత్వాలు నిధుల కేటాయింపు చేస్తున్నా.. రైతులకు మాత్రం బోరుబావుల అవసరం తప్పడం లేదు. ఎన్ని లిఫ్ట్ పంపులను వినియోగిస్తున్నా.. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏటా కొత్త కనెక్షన్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేండ్ల (2024–2026 ఏప్రిల్) కాలంలో ఏకంగా 1,91,380 కొత్త వ్యవసాయ మోటార్ కనెక్షన్లు మంజూరయ్యాయి.

ఇంకా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తగా మంజూరైన కనెక్షన్ల లెక్కలను డిస్కమ్‌ల అధికారులు వెల్లడించాల్సి ఉన్నది. ప్రస్తుతం ఎల్‌ నినో పరిస్థితులతో గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడం, రిజర్వాయర్ల నుంచి సాగునీటి సప్లై లేకపోవడం తదితరాలతో వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి మరిన్ని కొత్త కనెక్షన్లు వచ్చే అవకాశమున్నది. మరోవైపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. వ్యవసాయ మోటార్ కనెక్షన్లకు సబ్సిడీ రూపంలో ప్రతిఏటా సగటున రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. వీటిని డిస్కమ్‌లకు చెల్లించే సంగతి ఎలా ఉన్నా.. వ్యవసాయ విద్యుత్ వినియోగ భారం మాత్రం ప్రభుత్వం మోస్తున్నది. గత రెండేండ్లలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ (Telangana Power Subsidy) భారం రూ.19,684.20 కోట్లుగా తేలింది.

12 ఏండ్లలో 11 లక్షల పంప్‌సెట్లు

తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయ అవసరాల కోసం రైతులు వేసుకున్న బోరుబావులకు 19.03 లక్షల మోటార్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ సంఖ్య 2026 ఆగస్టు నాటికి 30.61 లక్షలకు చేరుకున్నది. ఈ పదేండ్లలో 11.58 లక్షల పంపుసెట్‌లు పెరిగాయి. కొత్త సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నా, రిజర్వాయర్ల నుంచి పొలాల వరకు కాల్వలు లేకపోవడంతో బోరుబావుల అవసరం తప్పట్లేదు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు జరిగినా, కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త రిజర్వాయర్లు వచ్చినా కెనాల్ సిస్టమ్ అవసరాలకు తగినంతగా ఇంప్రూవ్ కాకపోవడంతో రైతులకు బోరుబావులు, వ్యవసాయ పంపుసెట్ కనెక్షన్లే దిక్కయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెలువరించిన లెక్కల ప్రకారం.. 2024-26 మధ్య రెండేండ్ల కాలంలో ఎస్పీడీసీఎల్ (దక్షిణ డిస్కం) పరిధిలో 1,02,105 కొత్త మోటార్ కనెక్షన్లు, ఎన్పీడీసీఎల్ (ఉత్తర డిస్కం) పరిధిలో 89,275 కొత్త మోటార్ కనెక్షన్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కొత్తగా మంజూరైన వ్యవసాయ పంపుసెట్ కనెక్షన్ల వివరాలను రెండు డిస్కంలు వెల్లడించలేదు.

ప్రభుత్వంపై సబ్సిడీ భారం

వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. గత ప్రభుత్వం అదే చెప్పినా.. సబ్ స్టేషన్ల రికార్డులను పరిశీలించినప్పుడు రోజుకు యావరేజ్‌గా 10 గంటలకు మించి రావడం లేదని అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం 24 గంటలు అని చెప్తున్నా.. అది 10 గంటలకు మించి లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శిస్తున్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుత ప్రభుత్వం గత రెండేండ్లలో విద్యుత్ సబ్సిడీ కోసం రూ.19,684 కోట్లను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ లెక్కలు ఇంకా వెల్లడికాలేదు.

వ్యవసాయ విద్యుత్ వినియోగం యావరేజ్‌గా 28% వరకు ఉంటున్నట్లు రెండు డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి వెల్లడించిన ఏఆర్ఆర్ నివేదికల్లో వెల్లడించాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడం, వర్షాలు లేకపోవడంతో ఇకపైన వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నది. వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి రాష్ట్రం మొత్తం మీద 6,15,651 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర మీటర్లు ఉన్నాయి.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వివరాలివీ..

తెలంగాణ ఏర్పడే నాటికి (2014 వరకు): 19.03 లక్షలు
బీఆర్ఎస్ దిగిపోయే నాటికి (2023 డిసెంబర్): 28,69,441
కాంగ్రెస్ హయాంలో కొత్తవి (2024–2026 మార్చి): 1,91,380
రాష్ట్రంలో 2026 ఆగస్టు నాటికి మొత్తం కనెక్షన్లు: 30,60,821
ఎస్పీడీసీఎల్ పరిధిలో: 15,65,981
ఎన్పీడీసీఎల్ పరిధిలో: 14,94,840

విద్యుత్ సబ్సిడీ ఎంత?

2024-25: రూ.9,800.07 కోట్లు
2025-26: 9,884.13 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>