కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke), ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాయర్లతో చర్చల అనంతరం నేహా బోరాను పోలీసులు విడిచి పెట్టారు. అభిజిత్ దీప్కేను మాత్రం అదుపులోకి తీసుకుని, ఆయనపై బీఎన్ఎస్ 126/170 కింద కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో దీప్కేను ఎస్ఈఎం కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చబోతున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే.. ఆయన్ను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు కూడా అదే జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
చట్టవిరుద్ధంగా అరెస్టులు: నేహా బోరా
దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కానరావడం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శలు గుప్పించారు. సామాన్యులను కూడా క్రిమినల్స్లా చూస్తూ.. చట్టవిరుద్ధంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తమను రాత్రంతా పోలీసులు కస్టడీలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా రాత్రంతా పోలీస్ స్టేషన్లలో ఉంచాలని ఏ చట్టం అధికారం పోలీసులకు ఇచ్చిందని ప్రశ్నించారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేని మరోసారి నేహా తేల్చి చెప్పారు.

