ఖమ్మం జిల్లాలో విద్యుత్ సంక్షోభం.. అధికారులకు సవాల్

కలం, ఖమ్మం బ్యూరో :  వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, ఎల్‌నినో ప్రభావం ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు సరిగ్గా కురవని వర్షాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటగా, ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ మోటార్లను నిరంతరం నడిపిస్తున్నారు. మరోవైపు గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం విపరీతంగా పెరగడంతో విద్యుత్ వినియోగం ఊహించని స్థాయికి చేరింది. రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్‌తో(Power Demand) ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరుగుతుండగా, మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) మూడో యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం విద్యుత్ రంగానికి పెను సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాను స్థిరంగా కొనసాగించడం అధికారులకు సవాలుగా మారింది.

గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యుత్ డిమాండ్ అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో సగటున 5.44 మిలియన్ యూనిట్లుగా ఉండే విద్యుత్ వినియోగం ప్రస్తుతం 7.14 మిలియన్ యూనిట్లకు చేరింది. సెప్టెంబర్ 19న ఉదయం 11 గంటలకు గరిష్టంగా 456.20 మెగావాట్ల డిమాండ్ నమోదవగా, ఆ ఒక్కరోజే 7.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం ఏకంగా 25 శాతం పెరిగింది. అక్టోబర్‌లోనూ గరిష్ట డిమాండ్ 326.4 మెగావాట్లకు చేరుకుంది.

బీటీపీఎస్ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఆందోళన కలిగిస్తోంది. యూనిట్‌-3కు చెందిన రోటర్ ఎక్సైటర్‌లో లోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రోజుకు 270 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్ నిలిచిపోవడంతో గత నెల రోజుల్లో దాదాపు 16.5 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి గండిపడింది. ఈ కీలక పరికరానికి సంబంధించిన విడిభాగాలు రావడానికి సమయం పడుతున్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడించాయి.

ఉపకేంద్రాలపై పెరుగుతున్న ఒత్తిడి

వేసవిని తలపించేలా విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఉపకేంద్రాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వర్షాభావం, ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. మరోవైపు పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ మోటార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో పగటిపూట విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 220 కేవీ, 110 కేవీ, 33 కేవీ ఉపకేంద్రాలపై అదనపు భారం పడుతోంది.

పాల్వంచలోని సీతారామపట్నం ఉపకేంద్రం నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దగోపతి, బూడిదంపాడు 220 కేవీ ఉపకేంద్రాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఓవర్‌లోడ్ కారణంగా గురువారం ఉదయం పెద్దగోపతి ఉపకేంద్రంలో విద్యుత్ ట్రిప్ కావడంతో ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 40 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయింది. ఖమ్మం నగర పరిసరాల్లో గత వేసవిలో నమోదైన 110 మెగావాట్ల డిమాండ్‌కు సమానంగా ప్రస్తుతం పగటిపూట విద్యుత్ వినియోగం ఉంటోంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.

విద్యుత్ సరఫరా మెరుగుదలకు ముందస్తు చర్యలు

ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ పలు ముందస్తు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2026 వరకు జిల్లాలో 31 నూతన సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రియాక్టివ్ పవర్ భారాన్ని తగ్గించేందుకు 201 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాన్స్‌ఫార్మర్లను మార్చేందుకు జిల్లా కేంద్రాల్లో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచారు.

విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లా పరిధిలోని వివిధ సబ్‌స్టేషన్లను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యుత్ సరఫరా తీరును సమీక్షించారు. ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమైతే వెంటనే మార్చాలని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేలా రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్ పొదుపే కీలకం

ప్రకృతి సవాళ్లతో పాటు సాంకేతిక లోపాలను అధిగమించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రజల సహకారం కూడా అవసరం. వ్యవసాయ మోటార్ల వినియోగంలో రైతులు అప్రమత్తంగా ఉండటంతో పాటు, గృహాల్లో విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించడం కీలకం. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగితే ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు సరిపోతాయన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>