కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం అమ్మవారు రూ.6.11 కోట్ల నగదుతో ధనలక్ష్మి అలంకారం (Dhanalakshmi Alankaram)లో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆలూరు బిలకంటి రాములు ఆధ్వర్యంలో చేపట్టిన నగదు అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఏటా నవరాత్రుల్లో శుక్రవారం అమ్మవారిని కోట్లాది రూపాయల నగదుతో అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండ్ల జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఏటా కోట్లాది రూపాయలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్, యువజన సంఘం అధ్యక్షుడు బాదం జగదీష్, కార్యదర్శి వినోద్, కోశాధికారి కొండా రాఘవేంద్ర, వజ్రాల రాజేష్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ నరహరి హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.

