కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar) వందలాది మంది రైతులతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో వేళాపాళా లేకపోవడం, లో-వోల్టేజ్, తరచూ విద్యుత్ కోతల కారణంగా రైతులు (Dubbaka Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, విద్యుత్ సరఫరా సమయాలను ముందుగానే ప్రకటించాలని, పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లడుతూ.. లో-వోల్టేజ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లు కాలిపోతూ రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను 24 నుంచి 48 గంటల్లోపు ఉచితంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంటేనే వ్యవసాయ పనులు సజావుగా సాగుతాయని, విద్యుత్ సమస్యల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కొరారు.

