భక్తుల కొంగుబంగారం.. అడెల్లి పోచమ్మ తల్లి

కలం, సారంగాపూర్: సహ్యాద్రి పర్వతశ్రేణుల పచ్చదనం మధ్య కొలువుదీరిన అడెల్లి మహాపోచమ్మ తల్లి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరుగాంచిన అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామ సమీపంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం (Adelli Pochamma Temple) ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. ఏకశిల దర్శనమిచ్చే అమ్మవారు తన ఆరుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి పూజలందుకుంటున్నట్లు భక్తులు విశ్వసిస్తారు.

కరవును పారదోలిన పోచమ్మ తల్లి..

స్థలపురాణం ప్రకారం.. పూర్వం అడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు ఏర్పడి ప్రజలు తిండిలేక, అనారోగ్యాలతో అల్లాడేవారు. అనేక గ్రామాలు జనసంచారం లేక వెలవెలబోయాయి. తమను కాపాడాలంటూ ప్రజలు పరమశివుడిని ప్రార్థించగా, భక్తుల మొర ఆలకించిన ఆయన తన కుమార్తె పోచమ్మను ప్రజల రక్షణ కోసం భువిపైకి పంపినట్లు కథనం. తండ్రి ఆదేశంతో భువికి చేరుకున్న అమ్మవారు సమృద్ధిగా వర్షాలు కురిపించి కరవును తొలగించి ప్రజలకు అండగా నిలిచినట్లు భక్తుల విశ్వాసం. అప్పటి నుంచి అడెల్లి ప్రాంతంలోనే కొలువుదీరి భక్తుల కోర్కెలు తీరుస్తున్న తల్లిగా పూజలందుకుంటోంది.

పెరుగన్నమే ప్రీతికరం..

అడెల్లి పోచమ్మ తల్లికి పెరుగన్నం సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం. కోనేటి నీటితో అన్నం వండి పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పూర్వం నుంచి అమ్మవారికి పసుపుతో పూజలు నిర్వహిస్తుండటంతో గర్భగుడిలో పసుపు రాశులు కనిపిస్తుంటాయి. అమ్మవారిపై భక్తితో మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాని (Adelli Pochamma Temple) కి చేరుకుంటారు.

రెండు రోజుల పాటు గంగనీళ్ల జాతర

అడెల్లి మహాపోచమ్మ తల్లి గంగనీళ్ల జాతర శని, ఆదివారాల్లో నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా మహాలయ అమావాస్య అనంతరం వచ్చే శని, ఆదివారాల్లో జాతర జరుపుతారు. జాతర సందర్భంగా అమ్మవారి నగలను గోదావరి నదీ జలాలతో శుద్ధి చేసి తిరిగి ఆలయానికి తీసుకురావడం ప్రధాన ఘట్టం. జాతర తొలిరోజైన శనివారం ఉదయం అడెల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం నుంచి అమ్మవారి నగలను భాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా మహాపోచమ్మ ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు, భక్తుల సమక్షంలో నగలను గోదావరి నదీ తీరానికి తరలిస్తారు.

ఈ ఊరేగింపు అడెల్లి, సారంగాపూర్, యాకర్పెల్లి, వంజర్, ప్యారమూర్ గ్రామాల మీదుగా దిలావర్‌పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిలావర్‌పూర్, కంజర్, సాంగ్వి గ్రామాల గుండా సాగుతుంది. శనివారం రాత్రి నగలను నదీ తీరంలోని స్థానిక ఆలయంలో ఉంచుతారు. ఆదివారం ఉదయం పవిత్ర గోదావరి జలాలతో అమ్మవారి నగలను శుద్ధి చేసి, తిరిగి అదే మార్గంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆదివారం ఉదయానికి ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోతాయి. అమ్మవారికి పాయసం, సల్లనంబళ్లు నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరకు ఎడ్లబండ్లపై కుటుంబ సమేతంగా రావడం స్థానిక ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ ఇన్చార్జి భూమయ్య, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడంతోపాటు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. భక్తుల ఆరోగ్య అవసరాల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై శ్రీకాంత్ పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>