మర్రూరులో కరెంట్ కష్టాలు.. రైతులతో చిరుమర్తి ధర్నా

కలం, నకిరేకల్: ఎన్నికల ముందు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక, కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ రైతులను దగా చేస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) విమర్శించారు. కళ్లముందే పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ మండలం మర్రూర్(Marrur) గ్రామంలో విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంట పొలాలను శుక్రవారం స్థానిక రైతులతో కలిసి చిరుమర్తి లింగయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మర్రూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంగణంలో రైతులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేస్తున్నారని, అయితే విద్యుత్ కోతల కారణంగా పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రోజుకు ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయకపోవడం దారుణమని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, రైతులు రాత్రంతా పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని విమర్శించారు. పంటలు పూర్తిగా ఎండిపోకముందే అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని కోరారు. లేనిపక్షంలో నియోజకవర్గవ్యాప్తంగా రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>