వీరేశ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి: టీఆర్ఎస్ నేత రంజిత్

కలం, జోగులాంబ‌ గద్వాల: ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ వీరేశ్ (28) మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల‌పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని తెలంగాణ రక్షణ సేన (TRS) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ (Gongalla Ranjith Kumar) డిమాండ్ చేశారు. వీరేశ్‌పై ధరూర్ పోలీసులు దాడి చేసి, అవమానించార‌ని ఆయ‌న ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన వీరేశ్‌ ఈ నెల 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య‌త్నించాడ‌న్నారు. కర్నూల్ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడ‌ని చెప్పారు. అనంత‌రం మృతదేహాన్ని కర్నూల్ నుంచి గద్వాల జిల్లా ఆసుపత్రి వద్దకు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధ‌ర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ​దీంతో పోలీసులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టువీడని నాయకులు చివరకు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయం కోసం ధరూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వీరేశ్‌ను విచారణ పేరుతో పోలీసులు అవ‌మానించి, దాడి చేశార‌న్నారు. వీరేశ్‌ మరణానికి దారితీసిన పరిస్థితులను వెలికితీసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేప్ట‌టి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. వీరేష్ మృతికి గ్రామ సర్పంచ్‌ ముష్టి విజయ్‌, ధరూర్ పోలీసులే కార‌ణ‌మ‌ని, వారి పాత్రపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. వీరేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్ప‌ష్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని బూరెడ్డిపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>