కలం, దిలావర్పూర్: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల పూజలందుకుంటున్న సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారి జాతర (Adelli Pochamma Jatara)కు వేళయింది. శని, ఆదివారాల్లో నిర్వహించే ఈ జాతరకు నిర్మల్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలోని గోదావరి తీరంలో ఏర్పాట్లపై భక్తులు, గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం ఉదయం అమ్మవారి ఆభరణాలను భాజాభజంత్రీలతో ఊరేగింపుగా సుమారు 26 కిలోమీటర్ల మేర పాదయాత్రగా సాంగ్వి గ్రామానికి తీసుకురానున్నారు. ఆదివారం తెల్లవారుజామున గోదావరిలో ఆభరణాలను శుద్ధి చేసి తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలను దర్శించుకునేందుకు సుమారు 10 నుంచి 20 వేల మంది భక్తులు సాంగ్వికి చేరుకొని ఆభరణాలను దర్శించుకుంటారు.
గోదావరి తీరంలో సౌకర్యాల కరువు..
ఇంతటి ప్రాధాన్యత కలిగిన జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నా గోదావరి తీరంలో తగిన ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల భద్రత కోసం భారీకేడ్లు ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రివేళ భక్తులు సేదతీరేందుకు టెంట్లు, తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేవని గ్రామస్థులు చెబుతున్నారు. చీకట్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
సంబంధం లేదంటున్న అధికారులు..
ఏర్పాట్ల విషయమై ఆలయ ఇన్ఛార్జి ఈవోను సంప్రదిస్తే తమకు సంబంధం లేదన్నట్లుగా సమాధానం ఇస్తున్నారని సాంగ్వి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. భక్తుల నుంచి వచ్చే ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ, వారికి అవసరమైన సౌకర్యాల కల్పనపై ఎందుకు చూపడం లేదని దేవాదాయ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. జాతాకు వేలాదిగా తరలివచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని, సాంగ్వి గోదావరి తీరంలో విద్యుత్, తాగునీరు, టెంట్లు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

