రెండు నెలలకే తాగు నీళ్లు.. నీటి నిల్వలపై ఆందోళన!

కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్ట్‌తో తెలంగాణలో నీటి సంక్షోభం (Telangana Water Crisis)తో కరువు తలెత్తే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్ల వర్షాల్లేక, ప్రాజెక్టులు పూర్తిగా నిండక, సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లోని నీళ్లను తాగునీటికే వినియోగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లున్నాయి? అవి ఎన్ని రోజుల పాటు తాగు అవసరాలకు సరిపోతాయి? అనే లెక్కలు తీసింది. పంచాయతీ రాజ్ శాఖ రూపొందించిన ఈ రిపోర్టులో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సంగారెడ్డిలోని సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుత నీళ్లు కేవలం 60–75 రోజులకే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. నల్లగొండలోని ఉదయ సముద్రం ప్రాజెక్టులోనూ 70 రోజులు, ఖమ్మంలోని పాలేరు రిజర్వాయర్‌‌లో 104 రోజులు, వనపర్తిలోని రామన్‌ పాడు ప్రాజెక్టులో 120 రోజులు, రంగసముద్రం ప్రాజెక్టులో 173 రోజులకే సరిపడా నీళ్లు ఉన్నాయని ఆఫీసర్లు లెక్కగట్టారు.

నవంబర్ నుంచి తీవ్రం..

వచ్చే నెల నుంచి ఎల్‌ నినో మరింత తీవ్రమవుతుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకూ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో తాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో తాగునీటికి వార్షిక వినియోగం 44 టీఎంసీలుగా అంచనా వేసింది. సింగూరు రిజర్వాయర్ నుంచి సుమారు 13 టీఎంసీలు అవసరమవుతుండగా, ప్రస్తుతం 3.50 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఇవి 75 రోజులకే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత ఎస్సారెస్పీ, మల్లన్నసాగర్ నుంచి అందించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఇప్పుడున్న నిల్వలు నవంబర్ వరకు సరిపోతాయని, ఆ తర్వాత మల్లన్న సాగర్ నుంచి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జలమండలి తెలిపింది.

కొన్నిచోట్ల బోరుబావులు..

ఎల్‌ నినో కారణంగా రిజర్వాయర్లలోని నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉండడంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించడంపై పంచాయతీరాజ్ శాఖ సమీక్షించింది. అంచనాలకు భిన్నంగా తాగునీటి ఇబ్బందులు ఎదురైనట్లయితే ప్రత్యామ్నాయంగా చేతిపంపులు, బావుల ద్వారా సమకూర్చుకునేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 వేల చేతిపంపులు, 7,250 బావులను గుర్తించింది.

హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఎంత నీరు అందించవచ్చో, నీటిని ఇన్‌టేక్ వెల్స్‌కు తరలించడం, అక్కడి నుంచి శుద్ధి చేసిన నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకులకు పంపడం, ఇందుకు అవసరమైన విద్యుత్ తదితరాలపైనా సమీక్షించింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు 23,455 గ్రామీణ ఆవాసాల్లోని మొత్తం 52.90 లక్షల ఇండ్లకు, 20,510 స్కూళ్లకు, 145 అర్బన్ లోకల్ బాడీల్లోని ఇండ్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీక్షించాలని మంత్రి సీతక్క ఇటీవల ఆదేశించారు.

34 రిజర్వాయర్ల నుంచి సరఫరా..

  • రాష్ట్రంలోని తాగునీటి అవసరాలకు కృష్ణా బేసిన్‌లోని 14 రిజర్వాయర్ల నుంచి, గోదావరి బేసిన్‌లో 20 రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేయాలని పంచాయితీరాజ్ శాఖ లెక్కలేసుకున్నది.
  • కృష్ణా బేసిన్ నుంచి 19 టీఎంసీలు, గోదావరి బేసిన్ నుంచి 25 టీఎంసీలు వార్షిక వినియోగం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
  • ప్రస్తుతం గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో 138 టీఎంసీలు, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో 321 టీఎంసీల చొప్పున నీటి నిల్వలు ఉన్నాయి. ఇందులో కృష్ణా బేసిన్‌లో 37 టీఎంసీలు, గోదావరి బేసిన్‌లో 55 టీఎంసీల చొప్పున ఒక సంవత్సరానికి అవసరమవుతుంది. కానీ కొన్ని రిజర్వాయర్లలో అవసరానికి తగినంత నీటి నిల్వలు లేకపోవడంతో మూడు నెలల నుంచి 8 నెలల వరకు మాత్రమే సరిపోతాయని ఆఫీసర్లు అంచనా వేశారు.
  •  ఈ రిజర్వాయర్ల పరిధిలోని గ్రామాలు, ఆవాసాలకు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఉదాహరణకు సింగూరు రిజర్వాయర్‌లో ఉన్న నీరు 75 రోజులకే సరిపోతుందని.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఆవాసాలకు ఎస్సారెస్పీ నుంచి, మెదక్ జిల్లాలోని ఆవాసాలకు మల్లన్నసాగర్ నుంచి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

కృష్ణా బేసిన్‌లో పరిస్థితి ఇలా..

కృష్ణా బేసిన్‌లోని నిల్వలు:       321 టీఎంసీలు
ఇక్కడి నుంచి కావాల్సిన నీళ్లు: 37.49 టీఎంసీలు
రిజర్వాయర్లు: 14

గోదావరి బేసిన్‌లో పరిస్థితి ఇలా..

గోదావరి బేసిన్‌లోని నిల్వలు  :   138.56 టీఎంసీలు
ఇక్కడి నుంచి కావాల్సిన నీళ్లు: 54.74 టీఎంసీలు
రిజర్వాయర్లు : 20

రాష్ట్రవ్యాప్తంగా చేతి పంపులు  : 56,172
అందుబాటులో ఉన్న బావులు : 7,252

రిజర్వాయర్లలోని నీటి నిల్వల లెక్క ఇదీ..

గోదావరి బేసిన్

రిజర్వాయర్                      ప్రస్తుత నిల్వ(TMC)               ఎన్ని రోజులకు సరిపడా                   నీళ్లు ఏయే ప్రాంతాలకు సరఫరా
దుమ్ముగూడెం                    0.45                                    240                                 కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్
గడ్డెన్న ప్రాజెక్టు                  0.59                                    244                                 ముథోల్‌ నియోజకవర్గం
ఎస్సారెస్పీ                       42.53                              సంవత్సరం                            ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల
కడెం                               3                                   సంవత్సరం                             మంచిర్యాల, నిర్మల్
ఎల్లంపల్లి                        18.23                                సంవత్సరం                            పెద్దపల్లి, మంచిర్యాల
మిడ్‌మానేర్                     23.46                                సంవత్సరం                            జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి
లోయర్ మానేర్                15.49                                 సంవత్సరం                           హనుమకొండ, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేల, వరంగల్

కృష్ణా బేసిన్

రిజర్వాయర్                              ప్రస్తుత నిల్వ(TMC)      ఎన్ని రోజులకు సరిపడా                     నీళ్లు ఏయే ప్రాంతాలకు సరఫరా
వైరా                                          1.80                         237                                           ఖమ్మం, కొత్తగూడెం
జూరాల                                      7.2                        సంవత్సరం                                   గద్వాల, నారాయణ్‌పేట, వనపర్తి
శంకరసముద్రం                          0.65                            269                                         వనపర్తి, మహబూబ్‌నగర్
శ్రీశైలం                                     66.01                     సంవత్సరం                                    నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణ్‌పేట,

రంగారెడ్డి, వికారాబాద్

రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇలా..

రిజర్వాయర్                      ప్రస్తుత నిల్వ                       ఎన్ని రోజులకు సరిపడా                        నీళ్లు ఏయే ప్రాంతాలకు సరఫరా
ఉదయసముద్రం                   0.33                                      70                                           నల్లగొండ, భువనగిరి
సింగూర్                              3.50                                      75                                           కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి
పాలేరు                               1.69                                      104                                         ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు
రామన్ పాడు                        0.22                                      120                                         మహబూబ్‌నగర్, వనపర్తి
రంగసముద్రం                     0.57                                        173                                         వనపర్తి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>