కలం, కరీంనగర్: కరీంనగర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra ) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి షర్మిలతో కలిసి గురువారం డంపింగ్ యార్డ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంతోపాటు, డంపింగ్ యార్డ్‌కు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించే అంశంపై అధికారులతో చర్చించారు.
ప్రత్యామ్నాయ స్థలాల గుర్తింపుపై దృష్టి
ప్రస్తుత డంపింగ్ యార్డ్‌కు బదులుగా మరోచోట ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ప్రత్యామ్నాయ స్థలాల లభ్యత, అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలు, ఇతర అవసరమైన అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థలాల వివరాలను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
పొగ, కాలుష్య నివారణకు చర్యలు..
ప్రస్తుత డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్ ఆరా తీశారు. పొగ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలను తగ్గిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
డంపింగ్ యార్డ్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపే చర్యల్లో భాగంగా సీడీఎంఏ ఆధ్వర్యంలో స్వచ్ఛ మైనింగ్ ప్రక్రియతో పాటు ఇతర పనులపై చర్చించారు. చేపట్టనున్న పనులకు సంబంధించిన అంశాలను అధికారులతో సమీక్షించారు. ఈ పనుల ద్వారా ప్రస్తుత సమస్యలను తగ్గించడం, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు.
శాశ్వత పరిష్కారమే లక్ష్యం..
డంపింగ్ యార్డ్ సమస్యకు తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారం చూపడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక, కాలుష్య నియంత్రణ, ప్రతిపాదిత పనుల అమలుకు సంబంధించి అవసరమైన వివరాలను పరిశీలించి ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

