కలం, నిర్మల్ : రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో లక్షలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో 22ఏ నిషేధిత జాబితాలోని భూముల సమస్యలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించుకోవాలంటే లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో పలువురు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు అవినీతి పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు.
రెండు, మూడు దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంతో యజమానులు తమ ఆస్తులపై హక్కులు కోల్పోతామేమోనని భయపడుతున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల ఇళ్లను కూల్చివేస్తోందని ఆరోపించారు. హైడ్రా చర్యల్లో పక్షపాత ధోరణి కనిపిస్తోందని, ఫాతిమా కాలేజీ విషయంలో చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లను కూల్చివేయడంపై ఏలేటి ప్రశ్నించారు.
గతంలో ధరణిలో ఉన్న లోపాలే ప్రస్తుతం భూ భారతిలోనూ ఉన్నాయని ఎమ్మెల్యే ఏలేటి (Maheshwar Reddy) విమర్శించారు. భూ యజమానుల్లో గతంలో ఉన్న భయాందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజల భూముల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం నిషేధిత జాబితా పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. 22ఏ జాబితాలో భూముల చేర్పు, తొలగింపు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, బాధితులకు న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

