వరంగల్ యూజీడీ పనులకు కదలిక.. టెండర్ల వేగవంతానికి ఆదేశాలు

కలం, వరంగల్‌: వరంగల్‌ నగర సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు (Warangal UGD Project)ను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌, టెండర్‌ ప్రక్రియలో వేగం పెంచాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్‌ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు.

సాంకేతిక, పరిపాలనా పరమైన అంశాలను సమన్వయంతో పరిష్కరించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీదేవి సూచించారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి నగరంలో పారిశుధ్య మెరుగుదలకు, ప్రజారోగ్య పరిరక్షణకు కీలకమని పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న మాట్లాడుతూ.. సమగ్ర యూజీడీ వ్యవస్థతో మురుగునీటి నిర్వహణ మెరుగుపడటంతోపాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సంబంధిత శాఖలు, కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు వేగవంతం చేస్తామన్నారు.

కాగా, రూ.5,257 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే ప్రకటన వెలువడినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఉన్నతస్థాయి సమీక్షతో ప్రాజెక్టు కార్యాచరణలో పురోగతి సాధిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పబ్లిక్‌ హెల్త్‌ శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ సాయప్పరెడ్డి, ఎస్‌ఈ రంజిత్‌, బల్దియా ఈఈ మహేందర్‌, డీఈ కార్తీక్‌రెడ్డి, కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>