కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గం కేంద్రంలోని నెహ్రు చౌరస్తాలో హైమస్ లైట్లు వెలగకపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. సుమారు ఏడాది కాలం నుంచి లైట్స్ వెలగకుండా ఉన్నప్పటికి మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు నియోజకవర్గ కేంద్రానికి రకరకాల పనుల మీద వస్తుంటారు. షాపింగ్ చేసుకొని సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మళ్లీ వారి గ్రామానికి తిరుగు ప్రయాణమవుతారు. అచ్చంపేట పాత బస్టాండ్ ప్రాంగణంలోని ప్రధాన కూడలిగా చెప్పుకునే నెహ్రూ చౌరస్తాలో బస్సు కోసం రాత్రి సమయంలో వేచి చూసేవారు చీకట్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీటిపై వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించి లైట్లు వేయించాలని చుట్టుపక్కల వారు, వివిధ గ్రామాలను వచ్చే ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

