కలం, నారాయణపేట: మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాద్వార్ (Madhawar) గ్రామంలో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య రాములమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మరికల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ లింగయ్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మాద్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి బాలస్వామి (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆయనకు రాములమ్మతో సుమారు 28 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలస్వామికి గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో భర్తపై కోపం పెంచుకున్న రాములమ్మ అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వెల్లడించారు. 2026 సెప్టెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి తర్వాత బాలస్వామి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, వ్యవసాయ పనుల కోసం ఇంట్లో ఉంచిన పెట్రోల్ను అతడిపై పోసి నిప్పంటించినట్లు నిందితురాలిపై ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఈ ఘటనలో బాలస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. మొదట మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాలస్వామి చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న మృతి చెందాడు. ఈ ఘటనపై మొదట రాములమ్మ పోలీసులకు తెలిపిన వివరాలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తలుపులు తట్టి, కత్తితో బెదిరించి తన భర్తకు నిప్పంటించినట్లు నిందితురాలు మొదట తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, ఇతర వివరాలను పరిశీలించి విచారణ కొనసాగించగా, ఈ హత్యలో రాములమ్మ పాత్ర వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితురాలు రాములమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించిన మరికల్ సీఐ భగవంత్ రెడ్డి, ఎస్ఐ రామ్ లాల్, మహిళా ఎస్ఐ మహేశ్వరి, హెడ్ కానిస్టేబుల్, శిరీష, కానిస్టేబుల్స్ సమీర, రజితలను డీఎస్పీ అభినందించారు.

