రోడ్డు ప్ర‌మాద బాధితుల‌కు ఆర్థిక సహకారం: కలెక్టర్ రిజ్వాన్

కలం, జోగులాంబ గద్వాల: కర్ణాటకలోని యద్గిరి సమీపంలో భారత్ మాల రహదారిపై ఈనెల 10న జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన పలువురు కూలీలు బతుకు తెరువు నిమిత్తం ఈనెల 10న ట్రాక్టర్ పై కర్ణాటక రాష్ట్రానికి తరలి వెళ్తుండగా భారత్ మాల రహదారిపై వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురు గాయ‌ప‌డ్డారు. ఈ నేపథ్యంలో గురువారం పలువురు జిల్లా అధికారులు ఇందువాసి గ్రామంలో విచారణ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. డీడబ్ల్యూఓ సునంద, జిల్లా మైనారిటీ అభివృద్ధి శాఖ అధికారి అక్బర్ బాషా, పౌర సరఫరాల శాఖ మేనేజర్ విమల, గట్టు తహసీల్దార్ విజయ్ కుమార్, మెడికల్ అధికారి రమేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కుటుంబాల‌ పరిస్థితిపై విచారణ జరిపారన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన ఏసేపు, నాగన్న కుటుంబాలకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహకారం అందించడమే కాక వితంతు పెన్షన్లను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని క‌లెక్ట‌ర్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తామన్నారు. ఆయా కుటుంబ సభ్యుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చేర్పించి అన్ని విధాల సహకరిస్తామన్నారు. రాయచూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి తెలుసుకొని, వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వర్తింపజేసేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్, కుల, ఆదాయ, తదితర అవసరమైన సర్టిఫికెట్లను సంబంధిత రెవెన్యూ అధికారులు త్వరితగతిన మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రమాద ఘటన పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించి, బాధితులకు ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు భరోసా ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>