కలం, జోగులాంబ గద్వాల: ధరూర్ మండలంలోని నీలహళ్లి (Neelahalli) గ్రామంలో సాగునీరు అందక ఓ రైతు పడుతున్న అష్టకష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలువలు, రిజర్వాయర్లు ఉన్నా.. పొలాలకు నీరందక అన్నదాతలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. నీలహళ్లి గ్రామానికి చెందిన రైతు జమ్మన్న తన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖరీఫ్ సీజన్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట పొట్ట దశకు చేరుకుంది. ఈ కీలక సమయంలో పంటకు నిరంతరం నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అయితే, ఆయన పూర్తిగా బోరు బావిపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇటీవల భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోవడంతో బోరు ఆశించిన స్థాయిలో నీటిని ఇవ్వడం లేదు.
వాటర్ ట్యాంకే దిక్కు..
పెట్టిన పెట్టుబడి కాపాడుకోవడానికి, కంటికి రెప్పలా పెంచిన పంట ఎండిపోకుండా ఉండేందుకు రైతు జమ్మన్న ట్యాంకర్ నీళ్ల (Water Tanker)ను ఎంచుకున్నారు. ఏకంగా 2000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి, దాని ద్వారా పొలానికి నీటిని అందిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నీరు కూడా పంటకు సరిపోవడం లేదని ఆయన వాపోతున్నారు.
సమీపంలోనే నీళ్లున్నా అరకొరే..
సమీపంలోనే కృష్ణానది, గుడెందొడ్డి రిజర్వాయర్ నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ తమకు ఈ దుస్థితి తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరెంట్ కూడా సకాలంలో రాకపోవడంతో వ్యవసాయం మరింత భారంగా మారిందని తెలిపారు.

