కలం, మహబూబ్నగర్ బ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంతో పాటు, ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అర్హులైన అనేక కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించడంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మహబూబ్నగర్లోని స్థానిక హైటెక్ ఫంక్షన్ హాల్లో గురువారం మహబూబ్నగర్ గ్రామీణ మండలానికి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువవుతాయని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పారదర్శకమైన విధానంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. డిజిటల్ విధానంతో రేషన్ కార్డుల నిర్వహణ మరింత సులభతరమవడంతో పాటు, అర్హులైన పేదలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని యెన్నం ఆరోపించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు సకాలంలో పేదలకు రేషన్ కార్డులు అందించలేకపోయిందని విమర్శించారు. ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యతను అప్పటి ప్రభుత్వం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. పేదలకు కనీస అవసరాలైన ఆహారం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడటంలో పాలకుల చిత్తశుద్ధి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తే పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. గతంలో రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎదురుచూసిన అర్హులకు నేడు ప్రజా ప్రభుత్వం కార్డులు అందిస్తుడటం సంక్షేమ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి నాయకులు మల్లు అనిల్ రెడ్డి ధర్మాపుర్ నరసింహారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోవిందు యాదవ్, మోహన్ రెడ్డి, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రవీందర్, వెంకటేష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

