కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం (Karakagudem PHC) మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరై, సరైన సమాధానం ఇవ్వని మెడికల్ ఆఫీసర్ రవితేజకు ఛార్జ్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే వైద్యాధికారి గైర్హాజరుపై తప్పుడు సమాచారం అందించిన ఇద్దరు అవుట్సోర్సింగ్ జీఎన్ఎంలను విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.
అనంతరం బట్టుపల్లి గ్రామంలో సుమారు 1,160 ఎకరాల్లో జరుగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక పరికరాలతో భూముల హద్దులను పకడ్బందీగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కాంతయ్య, సర్వేయర్ సందీప్, బట్టుపల్లి సర్పంచ్ తోలేం రమాదేవి, రెవెన్యూ, వైద్య శాఖ సిబ్బంది ఉన్నారు.

