కలం, భైంసా : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతనంగా పెళ్లయిన వధువులకు తులం బంగారం అందించాలని, లేనిపక్షంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) డిమాండ్ చేశారు. గురువారం భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్స్లో భైంసా పట్టణం, మండలానికి చెందిన 121 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దసరా పండుగ నేపథ్యంలో లబ్ధిదారులకు పండుగకు ముందే చెక్కులు అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నూతన వధువులకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. బంగారం ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం అవగాహన లేమికి నిదర్శనమని ఆయన (Pawar Ramarao Patel) విమర్శించారు.
గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు అందించామని ముఖ్యమంత్రి చెప్పడం వాస్తవమేనని, రేషన్ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను ప్రజలు గుర్తించాలని సూచించారు. ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం అందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

