ప్రపంచ వేదికపై భారత రెజ్లర్‌ సత్తా..

కలం, స్పోర్ట్స్ : ప్రపంచ రెజ్లింగ్‌ వేదికపై భారత యువ రెజ్లర్‌ విశ్వజిత్‌ రామచంద్ర మోరే (Vishwajit Ramchandra More) చరిత్ర సృష్టించాడు. అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం (Silver Medal) సాధించాడు. అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో జరిగిన పురుషుల 55 కిలోల గ్రెకో-రోమన్‌ విభాగం ఫైనల్లో స్వర్ణానికి చేరువగా వచ్చి ఓడిపోయాడు. జార్జియా రెజ్లర్‌ కోబా కరుమిడ్జేతో హోరాహోరీగా తలపడి 12-13 తేడాతో పరాజయం పాలయ్యాడు. అయినా, ఈ విభాగంలో అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో రజతం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

ఫైనల్‌కు చేరే క్రమంలో విశ్వజిత్‌ మూడు కీలక విజయాలు సాధించాడు. మొదట మెక్సికోకు చెందిన ఐజాక్‌ మారిన్‌ మాటాను 10-8తో ఓడించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన అర్మిన్‌ షంషిపూర్‌పై 8-1తో గెలిచాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో రష్యా రెజ్లర్‌ మాలిక్‌ గిగియేవ్‌ను 6-4తో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. గతంలో ఇదే పోటీల్లో విశ్వజిత్‌ రెండు కాంస్య పతకాలు గెలిచాడు. ఇప్పుడు రజతం సాధించి మరో ఘనత అందుకున్నాడు. అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గ్రెకో-రోమన్‌ విభాగం ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగానూ నిలిచాడు. ఈసారి స్వర్ణం సాధించాలన్న లక్ష్యం తృటిలో చేజారింది.

మరోవైపు, ఈ పోటీల్లో భారత రెజ్లింగ్‌ జట్టుకు వీసాల సమస్య ఎదురైంది. గ్రెకో-రోమన్‌, మహిళల విభాగాలకు చెందిన తొమ్మిది మంది రెజ్లర్లకు అమెరికా వీసాలు నిరాకరించింది. వారు 20 ఏళ్లలోపు వయసులో ఉండటం, పూర్తిస్థాయి ఉద్యోగాలు లేకపోవడం వీసా తిరస్కరణకు కారణాలుగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీసాల నిరాకరణతో భారత్‌ పతక అవకాశాలు దెబ్బతిన్నాయని తెలిపాడు. వీసాలు తిరస్కరించిన వారిలో కనీసం ఇద్దరు స్వర్ణం సాధించే అవకాశాలున్న రెజ్లర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>