కలం, మెదక్ బ్యూరో: ఎల్నినో నేపథ్యంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) అన్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గురువారం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సింగూరు జలాశయంలో నీటి నిల్వలను పరిశీలించారు. అనంతరం పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో సమీక్ష నిర్వహించారు.
ట్రాన్స్కో సీఎండీ జితేశ్ వి. పాటిల్, కలెక్టర్ ప్రతీక్ జైన్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మాట్లాడారు. సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితుల ఆధారంగా నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సూచించారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలను గుర్తించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు.
రానున్న రోజులు కీలకం
రానున్న 15 నుంచి 20 రోజులు పంటల రక్షణకు కీలకమైనందున, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులను పరిశీలించాలన్నారు. రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లపై అధిక విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

