భూగర్భ జలాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ కుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు జిల్లాలో భూగర్భ జలాల పునరుద్ధరణ పనులు (Groundwater restoration work) త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ఆదేశించారు. జిల్లాలో VB-G RAM G పథకం కింద చేపడుతున్న వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటలు, తదితర పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆమె తెలిపారు. అలాగే, గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని అన్ని మండలాల MPDOs, APOs లు, ఇతర సంబంధిత అధికారులతో కలెక్టర్ (Collector Khushboo Gupta)వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విబిజి రామ్ జీ పథకం పనుల పురోగతి, గ్రామాల్లో తాగునీటి వనరుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. VB-G RAM G పథకం కింద వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలకు సంబంధించి మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల పురోగతిలో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి MPDO తమ పరిధిలోని గ్రామ పంచాయతీలను క్రమం తప్పకుండా సందర్శించి, పనుల స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. పనులు ప్రారంభించిన, పూర్తిచేసిన వివరాలతో పాటు ఫొటోలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించి, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తూ, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మంజూరైన ఇళ్లలో గ్రౌండింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించని ప్రాంతాల్లో సంబంధిత అధికారులు లబ్ధిదారులు, గ్రామస్థాయి కమిటీలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలం నిర్దేశిత గడువులోగా పురోగతిని గణనీయంగా పెంచాలని ఆదేశించారు.

తాగునీటి సమస్యల పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు

వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోర్లు, చేతిపంపులు, నీటి ట్యాంకులు, పైప్‌లైన్లు తదితర తాగునీటి వనరులను గుర్తించి, వాటి వివరాలను రాతపూర్వకంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా వనరుల నీటి లభ్యత, ఎంతకాలం నీటిని అందించగలవు, మరమ్మతులు అవసరమా అనే అంశాలను కూడా అంచనా వేయాలన్నారు. స్థానికంగా నీటి వనరులు లేని ఆవాసాలను గుర్తించి, వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ముందుగానే ట్యాంకర్లను గుర్తించి, రవాణా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఒకే ట్యాంకర్‌తో పలు ఆవాసాలకు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితుల్లో, జనాభాకు అనుగుణంగా నీటిని నిల్వ చేసుకునేందుకు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ ఆర్.డబ్లు.ఎస్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులను ప్రాధాన్యత ఆధారంగా వినియోగించి, దెబ్బతిన్న పైప్‌లైన్లు, పంపులు, బోర్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

బోర్లలో నీటి లభ్యత పెంచేందుకు అవసరమైన చోట ఫ్లషింగ్ పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాకు అత్యంత కీలకమైన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి MPDO తమ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన తాగునీటి వనరులు, నీటి కొరత ఉన్న ఆవాసాలు, అవసరమైన మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, నీటి నిల్వ ఏర్పాట్ల వివరాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

ఈ ప్రణాళికలను సిద్ధంగా ఉంచి, అవసరమైనప్పుడు వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటున్నందున, అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, ZPCEO, ఇంచార్జి DPO వెంకట్ రెడ్డి, DRDO నరసింహులు, గృహనిర్మాణ పి.డి ఉపేందర్ రెడ్డి, ఆర్. డబ్లు. ఎస్ ఇంజనీర్లు, MPDO లు, APOలు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>