కలం, ఆదిలాబాద్: లైసెన్సులు, అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని ఏడుగురుని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు వాహనాల్లో పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఏడుగురు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన రవికుమార్ ద్వారా పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతరుల పేర్లపై బిల్లులు తీసుకొని, బూస్టర్ బాక్సుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను ఉంచి తెలంగాణకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీటిని క్రషర్లు, క్వారీలు, గనులకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల విలువ సుమారు రూ.19 లక్షలు కాగా, 90 బూస్టర్ల విలువ రూ.15 వేలు ఉంటుందని పేర్కొన్నారు. లైసెన్సులు, అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను రవాణా చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

