నాలుగేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. వధువు షాకింగ్ నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లాడిన కొన్ని గంటల్లోనే ఓ నవవధువు జీవితం తలకిందులైంది. నాలుగేళ్ల ప్రేమ బంధం, ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా జరిగిన వివాహం.. కేవలం మద్యం మత్తులో పెళ్లికొడుకు చేసిన ఒకే ఒక్క తప్పుతో విడాకుల వరకు వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కన్యాకుమారి (Kanyakumari) జిల్లా కుళుచ్చల్‌కు చెందిన రూబెన్(31) ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. కేరళలోని పరశాలైకి చెందిన 26 ఏళ్ల యువతి తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత యువతి కుటుంబ సభ్యులు ఈ వివాహానికి నిరాకరించినప్పటికీ, తర్వాత వారి ప్రేమను అంగీకరించారు.

తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో గత సోమవారం వీరి వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం వివాహ రిసెప్షన్ వేడుకను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పెళ్లైన ఆనందంలో వరుడు రూబెన్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. రిసెప్షన్ సమయంలో మద్యం మత్తులో తూలుతూ వధువు తండ్రి కంట పడ్డాడు. పవిత్రమైన పెళ్లి వేడుకలో ఇలా తాగి రావడమేంటని వధువు తండ్రి రూబెన్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

గొడవ పెద్దదవుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన నవవధువుపై రూబెన్ ఒక్కసారిగా చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన మామపై కూడా దాడికి దిగాడు. ఈ ఘర్షణ అనంతరం రూబెన్ రిసెప్షన్ వేదిక నుంచి కోపంతో వెళ్లిపోయాడు. పెళ్లైన మొదటి రోజే భర్త ప్రవర్తించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన వధువు, ఆమె తండ్రి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూబెన్‌పై ఫిర్యాదు చేశారు.

కొద్ది గంటల్లోనే ముగిసిన బంధం:

పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సిలింగ్‌లోనూ రాజీకి రాకపోవడంతో, మద్యం మత్తులో భార్యను, కుటుంబ సభ్యులను అవమానించిన వ్యక్తితో కలిసి జీవించలేనని వధువు స్పష్టం చేసింది. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే భర్తతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, తండ్రితో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>