కలం, స్పోర్ట్స్: రిటైర్మెంట్కు ముందు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం రావడం తనకు వరమని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (Sikandar Raza) పేర్కొన్నాడు. 2027 ప్రపంచకప్‌కు జింబాబ్వేతో పాటు దక్షిణాఫ్రికా, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తన దేశం తరఫున ఆడటం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని 40 ఏళ్ల రజా తెలిపాడు. ప్రపంచకప్ ద్వారా జింబాబ్వే అందాలను, ఆతిథ్యాన్ని అంతర్జాతీయ అభిమానులకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు రజా పేర్కొన్నాడు.
ఆఫ్రికా అందాలు, అక్కడి ప్రేక్షకుల ఉత్సాహం, ప్రజల ఆప్యాయతను ప్రపంచం చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. జింబాబ్వేకు వచ్చి మ్యాచ్‌లు చూసే అభిమానులకు ఈ పర్యటన మధుర జ్ఞాపకంగా మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2027 ప్రపంచకప్ కోసం ప్రతిపాదించిన కొత్త ఫార్మాట్పైనా రజా సానుకూలంగా స్పందించాడు. తొలి రౌండ్లో మూడు జట్లు పోటీపడతాయి. అందులో విజేత తదుపరి దశకు చేరుకుంటుంది.
ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. అనంతరం సూపర్ సెవెన్ దశ, నాకౌట్ పోటీలు జరుగుతాయి. బాగా ఆడిన జట్లకు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించడం మంచి నిర్ణయమని రజా అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ, ఐసీసీ టోర్నీల్లో జింబాబ్వేకు పూర్తి స్థాయిలో హోమ్ అడ్వాంటేజ్ లభించడం కష్టమని రజా పేర్కొన్నాడు. పిచ్‌ల తయారీ, ఆట పరిస్థితులపై ఐసీసీ నియంత్రణ ఉంటుందని తెలిపాడు.
అయినప్పటికీ, నిబంధనలకు లోబడి తమకు సాధ్యమైన ప్రయోజనాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశాడు. విక్టోరియా ఫాల్స్‌లో కొత్త స్టేడియం ప్రారంభం కానుండటంపై జింబాబ్వే జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాబోయే నెలల్లో స్టేడియం అందుబాటులోకి వస్తుందని రజా ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది అక్కడ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో జట్టు ఉత్సాహంగా ఉందని తెలిపాడు.

