కలం, జోగులాంబ గద్వాల: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి అని, ఆయనకు పాలమూరు బిడ్డనని చెప్పుకునే అర్హత లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పడకేయించి, జిల్లాకు సాగునీరు అందించకుండా రైతుల పొట్ట కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టు మండలం రాయపురం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను బుధవారం మాజీమంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, దేవర కద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని, సాగునీరు అందక జిల్లాలో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎప్పుడో చెప్పినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధుకు రాంరాం చెప్పిందని, మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టడంతో పాటు రైతుబీమాను కూడా బంద్ చేశారని విమర్శించారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ కరువైందని, కళ్యాణలక్ష్మి తులం బంగారం హామీ ఏమైందని నిలదీశారు. పెళ్లికి రావాల్సిన చెక్కులు పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

