కలం, వనపర్తి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను ఆపకుండా నడిపి, నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ప్రాజెక్టు పనులను నిలిపివేసి, ఇప్పుడు పంపులు ప్రారంభించిన ఘనత తమదేనన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నార్లాపూర్‌లో పంపుల ప్రారంభం సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పంపుల ప్రారంభానికి అవసరమైన పనులు పూర్తయ్యాయని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కాలువల టెండర్లను రద్దు చేసింది ఎవరు? మూడేళ్లుగా కాలువల తవ్వకాలను అడ్డుకున్నది ఎవరు? ప్రాజెక్టు పనులు సాగకుండా కోర్టుల్లో కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అప్పట్లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్లోనే ఉన్నారని గుర్తుచేశారు. మూడేళ్ల క్రితమే నార్లాపూర్‌లో పంపును కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
శ్రీశైలంలో నీళ్లున్నా ఎందుకు నడపలేదు?
ఎల్‌నినో ప్రభావంతో కరువు వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను ప్రారంభించి నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ గతంలోనే డిమాండ్ చేసిందని తెలిపారు. నార్లాపూర్–ఏదుల మధ్య పెండింగ్ పనులు పూర్తి చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. శ్రీశైలంలో నీరున్నప్పటికీ గత రెండు నెలలుగా నార్లాపూర్ పంపులను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, రైతులపై ప్రేమ ఉంటే కనీసం రెండు పంపులైనా నడిపి వట్టెం, కరివెన వరకు సాగునీటిని తీసుకెళ్లవచ్చన్నారు. పది పంపులను నడిపేందుకు పెండింగ్ పనులు అడ్డంకిగా ఉన్నప్పటికీ, నార్లాపూర్, ఏదుల వద్ద రెండు పంపులను నడపడానికి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను కూడా పూర్తి స్థాయిలో ఎందుకు నడపలేదని నిలదీశారు.
హెచ్చరికల తర్వాతే పంపులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నీటిని సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు తరలిస్తుంటే, తెలంగాణలో రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటార్లను ప్రారంభించిందన్నారు. ఇప్పటికైనా నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తిగా నిండే వరకు పంపులను నిరంతరాయంగా నడపాలని, ప్రాజెక్టులో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా పనులను నిలిపివేసినందుకు పాలమూరు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

