అడెల్లి పోచమ్మ జాతరపై అధికారుల నిర్లక్ష్యం..!

కలం, సారంగాపూర్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. భక్తుల ఇలవేల్పుగా పేరొందిన సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అడెల్లి శ్రీ మహాపోచమ్మ తల్లి జాతర (Adelli Pochamma Thalli Jatara) కు ప్రచారం కరువైంది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ జాతరకు గడువు సమీపిస్తున్నా, ప్రచార కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే జాతరకు ఈసారి ఏర్పాట్లలో జాప్యం కనిపిస్తోందని ఆవేదన చెందుతున్నారు. మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా.. ఇప్పటికీ ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లు ముద్రించకపోవడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఆరు నెలలుగా పాలకవర్గం ఖాళీ..

అడెల్లి మహాపోచమ్మ ఆలయ పాలకవర్గం గడువు ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు జాతర ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తుంటారు. అయితే ఈసారి కొత్త పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉండటంతో జాతర ఏర్పాట్లపై సందిగ్ధత నెలకొందని భక్తులు అంటున్నారు. ప్రతి ఏటా జాతరకు వారం రోజుల ముందే ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లు ముద్రించి ప్రచారం నిర్వహించేవారని గుర్తుచేస్తున్నారు. ఈసారి మాత్రం జాతర సమయం దగ్గరపడుతున్నా ఆ దిశగా కదలికలు కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడే ముద్రిస్తే ఎప్పటికి పంపిణీ చేస్తారు?

జాతర (Adelli Pochamma Thalli Jatara) కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేయడం ఆనవాయితీ. వాల్‌పోస్టర్ల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి సమయం అవసరం. కానీ జాతరకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఇప్పుడు ముద్రణ చేపట్టి, ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఎప్పుడు ప్రచారం నిర్వహిస్తారు? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పాలకవర్గం నియామకం జరిగితే ఆహ్వాన పత్రికల్లో పేర్లు మారుతాయనే ఉద్దేశంతోనే ముద్రణలో జాప్యం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాలకవర్గం నియామకంతో సంబంధం లేకుండా జాతరకు అవసరమైన ప్రచారం, ఏర్పాట్లపై అధికారులు ముందస్తు దృష్టి సారించాల్సిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక..

అడెల్లి శ్రీ మహాపోచమ్మ అమ్మవారి జాతరకు నిర్మల్‌ జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అమావాస్య మరుసటి శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగే ఈ జాతరలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన జాతరకు ప్రచారం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని భక్తులు పేర్కొంటున్నారు. జాతర నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, ప్రచార కార్యక్రమాలతో పాటు ఇతర ఏర్పాట్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు. అమ్మవారి జాతరను విజయవంతంగా నిర్వహించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండు రోజుల్లో ఆహ్వానపత్రికలు పంపిణీ చేస్తాం : ఇంచార్జి ఈఓ

ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్ల ముద్రణలో జాప్యంపై ఆలయ ఇంచార్జి కార్యనిర్వహణాధికారి భూమయ్యను వివరణ కోరగా.. 200 ఆహ్వాన పత్రికలు, 500 వాల్‌పోస్టర్ల ముద్రణ కోసం బుధవారం హైదరాబాద్‌కు పంపించినట్లు తెలిపారు. గురువారం ఉదయం వరకు అవి అందుతాయని, అనంతరం రెండు రోజుల్లో అధికారులకు ఆహ్వాన పత్రికలు అందజేసి ప్రచారం నిర్వహిస్తామని ఈఓ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>