మాజీ మంత్రి నీతులు చెప్ప‌డం హాస్యాస్ప‌దం: మారెపల్లి సురేందర్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీతులు చెప్పే ముందు గత పదేళ్ల పాలనలో నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని మహబూబ్‌నగర్ నగర డిప్యూటీ మేయర్ మారెపల్లి సురేందర్ రెడ్డి (Marepally Surender Reddy) విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు, భయాందోళనలను విస్మరించి ఇప్పుడు నీతులు వల్లించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నారని, మరోసారి ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, అధికారం కోల్పోయిన తర్వాత ప్రజాస్వామ్యం, న్యాయం, నీతి గురించి మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

గత పదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న పరిణామాలపై సమాధానం చెప్పిన తర్వాతే ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరు ప్రజల పక్షాన నిలిచారో.. ఎవరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహరించారో వారికి తెలుసన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి ఇతరులపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తూ, ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.

ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.మహబూబ్‌నగర్ పట్టణంలో యెన్నం విద్యా,వైద్యరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడం, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, అభివృద్ధి పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చకు రావాలని మాజీ మంత్రికి సురేందర్ రెడ్డి సూచించారు.

గతంలో ఏం జరిగింది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? అనే అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం లేదన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ స‌మావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు గుమ్మాల్ శ్రీనివాస్, సంతన్న యాదవ్, గోవర్ధన్ గౌడ్, సీజే బెనహర్, గిరిధర్ గౌడ్, ఆయా డివిజ‌న్‌ల‌ కార్పొరేట్లు, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>