డబ్బులు అడిగిన పాపానికి స్నేహితుడినే చంపేశాడు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పరిధిలోని కరకగూడెంలో తీవ్ర కలకలం రేపిన హత్యోదంతం వీడింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఉదంతంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ​కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలువల నాగారం గ్రామానికి చెందిన బాధావత్ రవిచంద్ర, అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్‌కు రూ. 80,000 అప్పుగా ఇచ్చాడు. అయితే, ఆ నగదును తిరిగి చెల్లించే విషయంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. డబ్బులు త్వరగా ఇవ్వాలని రవిచంద్ర నిత్యం డిమాండ్ చేస్తూ వచ్చాడు.

​డబ్బుల కోసం ఒత్తిడి పెరుగుతుండటంతో కక్ష పెంచుకున్న మహమ్మద్ ఇమ్రాన్ పథకం ప్రకారం రవిచంద్రను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 9.30 గంటల సమయంలో రవిచంద్రను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని కలువల నాగారం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో అతనిపై దాడి చేశాడు. క్రూరంగా బెల్టుతో గొంతు బిగించి హత్య చేశాడు.

​ఈ హత్యపై మృతుని తల్లి బాదావత్ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 12న కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం న్యాయస్థానానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>