పేద‌ల సంక్షేమం, దేశ భ‌ద్ర‌తే మోదీ లక్ష్యం: భండారి శాంతి కుమార్

కలం,​ మహబూబ్‌నగర్ బ్యూరో: ​ప్రజాప్రతినిధిగా 25 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ నాయకత్వం దేశ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతి కుమార్ (Shanthi Kumar Bhandari) అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుపరిపాలనకు బాటలు వేయడం నుంచి, నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారత ప్రధానిగా దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడం వరకు మోదీ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. సంపాదన కష్టమైన పరిస్థితుల్లోనూ, దేశంలోని కోట్లాది మంది నిరుపేదలకు రేషన్ బియ్యం ఎక్కడా ఆగకుండా ఉచితంగా నేరుగా అందిస్తున్న ఘనత ప్రధాని మోదీదే అన్నారు.

​సాహసోపేత నిర్ణయాలు.. దేశ భద్రత

​1992లో ఉగ్రవాదుల హెచ్చరికలను లెక్క చేయకుండా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పటి నుంచి, దశాబ్దాలుగా వేధిస్తున్న ఆర్టికల్ 370ని ధైర్యంగా రద్దు చేసే దాకా మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం కేవలం దేశం కోసమేన‌ని శాంతి కుమార్‌ అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ దేశ సరిహద్దులను అత్యంత సురక్షితంగా మార్చారని ఆయన తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారితో ​ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో మోదీ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాతో భారత్‌ను ‘విశ్వబంధు’గా నిలిపార‌న్నారు. ​ఇటీవల పశ్చిమ బెంగాల్ నుంచి పుదుచ్చేరి దాకా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీఏ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం ప‌ట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సాగించే అబద్ధాల ప్రచారాన్ని, విద్రోహ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు. ఈ సమావేశంలో పడకుల బాలరాజు, సుదర్శన్ రెడ్డి, నంబి రాజు, అంజయ్య, ఎగ్గని నరసింహులు సాగర్, కొండ బుచ్చారెడ్డి, వీరబ్రహ్మాచారి, ప్రతాప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గూడెం నారాయణ, రామ్‌రెడ్డి, కౌకుంట్ల అంజనేయులు, మోహన్ తదితర బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>