కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణ, భద్రత దృష్ట్యా వైసీపీ వేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీసు డైరెక్టర్ జనరల్కు హైకోర్టు నోటీసులు పంపింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై తమ వివరణను సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల పాత్ర కీలకంగా ఉండటంతో, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమాచారం కోరింది.
ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరుపకుండా.. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించడంతో పాటు, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలు, ప్రత్యక్ష వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఇప్పటికే రాజకీయ పార్టీలు సిద్దమౌతున్న తరుణంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి విచారణలో ఎన్నికల సంఘం, సంబంధిత శాఖల అధికారులు సమర్పించే వివరాల ఆధారంగా ఈ అంశంపై మరింత క్లారిటీ రానుంది.

