కలం, మహబూబ్నగర్ బ్యూరో: జడ్చర్ల (Jadcherla) మండల పరిధిలోని ఖానాపూర్లో భూ రీసర్వే పనులను అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ పరిశీలించారు. బుధవారం ఆమె వివిధ ప్రాంతాలను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిప్రియ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను పరిశీలించారు. అనంతరం పురోగతిని సమీక్షించారు. నూతన రీసర్వే బృందాల సేవలను వినియోగించుకొని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రీసర్వే పనుల పురోగతిని జిల్లా యంత్రాంగం ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూల కొలతలను కచ్చితత్వంతో చేపట్టి, సరిహద్దులను స్పష్టంగా గుర్తించేందుకు ఆధునిక రోవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
రీసర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూయజమానులకు ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ (LPMs) అందజేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల భూ సరిహద్దులు, రెవెన్యూ రికార్డులకు సంబంధించి భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. భూ రీసర్వే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా అధికారులకు పూర్తి సహకారం అందించాలని రైతులను ఆమె కోరారు.

