కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన, లాభదాయకమైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలు సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మంచి పారిశ్రామిక విధానాలను రద్దు చేయకుండా కొనసాగిస్తున్నామని, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో పెట్టుబడిదారుల విధానాల్లో ఎలాంటి ప్రతికూల మార్పులు చేయలేదని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలకు పెట్టుబడులు వచ్చినా తాము సంతోషిస్తామని అన్నారు.
ఆర్థిక ప్రగతిలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పైగా ఉందనే విషయాన్ని గుర్తుచేస్తూ, మహిళా పారిశ్రామికవేత్తలను విశేషంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళా శక్తికి ప్రాధాన్యమిస్తూ రూ.61 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లలో మహిళలను యజమానులుగా తీర్చిదిద్దామని చెప్పారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా యువతతో పాటు మహిళా వ్యవస్థాపకులను పెద్దపీట వేసి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రామాణికంగా తీసుకున్నామని సీఎం వివరించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రాన్ని CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ – ఐటీ, సర్వీసెస్), PURE (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ – తయారీ, లాజిస్టిక్స్), RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ – ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్) అనే మూడు విభాగాలుగా వర్గీకరించి వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్నట్లు వెల్లడించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుండి 10 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని, పారిశ్రామికవేత్తలందరూ ఈ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. సీనియర్ నాయకులు వి.హనుమంతరావు తాను ఇంకా మాట్లాడలేదని అనడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు.

