కలం, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల (Krishna Water Dispute) విషయంలో మునుపెన్నడూ లేనన్ని సవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డం పడుతూ ఏపీ ప్రభుత్వం తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. మరోవైపు నీటి వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరగడం.. ఇంకోవైపు ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు కాబట్టే రాష్ట్ర నీటి హక్కుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కొట్టాడడం లేదంటూ బీఆర్ఎస్ విమర్శలు చేయడం.. కేంద్రంలో, ఏపీలోనూ ఎన్డీయే సర్కార్ ఉండడంతో ఆ రాష్ట్రానికి అడ్వాంటేజ్‌గా మారడం.. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటే కేంద్రంలో చెల్లుబాటు కావడం.. ఇవన్నీ తెలంగాణకు సవాళ్లుగా మారాయి.
ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం, నీటి హక్కులను సాధించుకోవడం, ఏపీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడం, వాటిని పూర్తి చేయడం.. సీఎం రేవంత్ రెడ్డికి సవాలుగా మారింది. చంద్రబాబు శిష్యుడనే ముద్రను తొలగించుకోవడమూ కీలకంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు మిగిలిన రెండేండ్లలో దాన్ని పూర్తి చేయడమూ పెద్ద టాస్క్‌గా మారుతుంది.
తరచూ ఏపీ మోకాలడ్డు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన నారాయణ్‌పేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తప్పుపడుతున్నది. కొడంగల్, నారాయణ్‌పేట్, మక్తల్ నియోజకవర్గాల్లో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ.2,945 కోట్ల ఖర్చుతో నిర్మించేలా 2024 ఫిబ్రవరిలోనే సర్వే, సమగ్ర పరిశీలన, డిజైన్‌ల రూపకల్పన, ఎగ్జిక్యూషన్ కోసం పరిపాలనాపరమైన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం ట్రిబ్యునల్‌లో విచారణ దశలో ఉండగా, ఈ ప్రాజెక్టును టేకప్ చేయడాన్ని ఏపీ తప్పుపడుతున్నది. దీనిపై కృష్ణా బోర్డు సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించిన ఏపీ… త్వరలో జరగబోయే సమావేశంలో సైతం దీన్ని ఎజెండా ఐటెమ్‌గా చేర్చింది. ఈ ప్రాజెక్టును వెంటనే ఆపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి మొత్తం 11 ప్రాజెక్టులు, మరికొన్ని ఇరిగేషన్ అంశాలపై ఏపీ రాతపూర్వకంగా అభ్యంతరాలను బోర్డుకు తెలియజేసింది.
కేంద్రంలో చంద్రబాబు చక్రం
కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉండడం చంద్రబాబుకు కలిసొచ్చింది. కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖలో చంద్రబాబు చెప్పిన మాటే చెల్లుబాటవుతున్నదని, ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతున్నారనే వాదన ఉంది. చంద్రబాబు మాటను జలశక్తి మంత్రి, ప్రధాన మంత్రి కూడా కాదనే పరిస్థితి నెలకొన్నదనే ప్రచారం ఉంది. తెలంగాణకు చెందిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్‌బీసీ, కొడంగల్ లిఫ్ట్, అచ్చంపేట, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ఫిర్యాదు చేయడం వెనుక ఈ రాజకీయ బలమే కారణమన్న వాదనలున్నాయి.
ఈ అనుకూలతతోనే తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన పలు రకాల అనుమతుల విషయంలో తగిన సహకారం లభించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ బలంతోనే కేఆర్ఎంబీలో తెలంగాణ డిమాండ్ చేస్తున్న ఫిఫ్టీ-ఫిఫ్టీ (50:50) వాదన అమలుకు నోచుకోకుండా అక్కడే ఆగిపోయింది. ఏపీ ప్రభుత్వం పోలవరం మొదలు బనకచర్ల వరకు నిధులు, అనుమతులు తెచ్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులపై దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే తెలంగాణ మాత్రం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏక కాలంలో కేంద్రం నుంచి సానుకూల ఫలితాలను పొందడం, ఏపీతో గట్టిగా కొట్లాడడం, కృష్ణా బేసిన్ జలగండాన్ని అధిగమించడం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది.
పాలమూరు ప్రాజెక్టులే కీలకం
ఎల్ నినో కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ద్వారా నీటిని తీసుకెళ్తూ ఉంటే తెలంగాణ ప్రేక్షకపాత్ర వహించడంపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సర్కార్‌ను నిలదీస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులైనా ఏపీ ప్రభుత్వం మాటే చెల్లుబాటు కావడం, కండ్ల ముందే నీటిని తరలించుకుపోవడం, కేఆర్ఎంబీ సమావేశాల్లోనూ ఆ రాష్ట్రం ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, తెలంగాణ లేవనెత్తిన 50:50 నీటి వినియోగం కొలిక్కి రాకపోవడం.. ఇవన్నీ చర్చనీయాంశాలుగా మారాయి.
రెండేండ్లలో పాలమూరు ప్రాజెక్టును కొలిక్కి తేకపోతే ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను విమర్శించిన పరిస్థితి నుంచి సొంత జిల్లా ప్రజలే నిందించే పరిస్థితిని సీఎం ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్షణ, దీర్ఘకాల ప్రయోజనాలపై ప్రయారిటీస్‌ను ఫిక్స్ చేసుకోవడం, దానికి తగిన అడుగులు వేయడంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. తుమ్మిడిహెట్టి లాంటి వాటిపై చూపే శ్రద్ధను ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడంపైనా, అవసరమైన అనుమతుల్ని కేంద్రం నుంచి తెచ్చుకునేలా వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఆ మచ్చ పోయేనా?
చంద్రబాబునాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి శిష్యుడని, గురుదక్షిణగా తెలంగాణ నీటి హక్కులను ఆ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్నారని, సొంత రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా ఏపీకి తాకట్టు పెట్టి ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. ఈ ముద్ర నుంచి బయటపడడం ముఖ్యమంత్రికి ప్రధాన టాస్క్‌గా మారింది. ఢిల్లీలో ఉన్న పలుకుబడితో చంద్రబాబు చక్రం తిప్పుతూ ఉంటే ఆయన శిష్యుడిగా ఉన్నందునే సీఎం రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదని, ఏపీ ఎంత నీటిని తీసుకుంటున్నా నిస్సహాయంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది.
నీటి హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో, ఏపీతో కొట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అనివార్యంగా మారింది. సొంత రాష్ట్రంలో విపక్షాల నుంచి వచ్చే విమర్శలను, రాజకీయ దాడిని దీటుగా ఎదుర్కోవడం, సమాధానం చెప్పడం మరో ఛాలెంజ్‌గా మారింది. తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న కమాండ్‌తో ఇక్కడి ప్రాజెక్టుల అనుమతులకు ఇబ్బందులొస్తాయనే ఆందోళన ఒకవైపు, సామరస్యంగా ఉంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు మరోవైపు సీఎం రేవంత్‌ను వెంటాడుతున్నాయి.

