కలం, ఖమ్మం బ్యూరో: లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. చర్ల (Charla) మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్‌లో పనిచేస్తున్న కుక్ జీతం మంజూరు చేయడానికి గాను రూ. 14,000 లంచం డిమాండ్ చేసిన వార్డెన్ భూక్యా వాల్ సింహను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. వార్డెన్ వాల్ సింహ లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

