కలం, నాగార్జునసాగర్: వినాయక విగ్రహ ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పూజారి మృతి చెందిన విషాద ఘటన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెంలో(Chintalapalem) సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వినాయక చవితి సందర్భంగా చింతలపాలెం గ్రామంలో పలు చోట్ల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ప్రారంభ పూజా కార్యక్రమాల కోసం నాగార్జునసాగర్‌కు చెందిన దత్తాత్రేయ శాస్త్రి (దత్తు అయ్యగారు) పూజారిగా హాజరయ్యారు. అయితే ముందుగా తమ వినాయక విగ్రహం వద్దే పూజ నిర్వహించాలని ఇరువర్గాలు పట్టుబట్టడంతో పూజారితో వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఈ క్రమంలో దత్తాత్రేయ శాస్త్రి కిందపడిపోగా తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పైలాన్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తిరుమలగిరి సాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయక చవితి రోజే దత్తాత్రేయ శాస్త్రి మృతి చెందడంతో సాగర్ పైలాన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జునసాగర్ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.

