కాంగ్రెస్‌పై పువ్వాడ విమర్శల అస్త్రాలు..!

​కలం, ఖమ్మం బ్యూరో : “మోసపడితే గోసపడతారని ఆనాడే కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.. ఈనాడు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీరు లేక అల్లాడుతున్న రైతులను చూస్తే అది అక్షరాలా నిజమైంది” అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ సభలో పాల్గొన్న ఆయన, రైతులకు కరెంట్, సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

3-ఫేస్ విద్యుత్ లేకపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం వంటి పాత కాంగ్రెస్ రోజుల నాటి దుస్థితి మళ్లీ పునరావృతమైందని, ఉపాధి లేక, కరెంట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం యాప్‌ల పేరుతో క్యూ లైన్లలో నిలబెట్టి వేధిస్తున్నారని, ‘రైతు బంధు’ సాయాన్ని ఓట్ల రాజకీయం కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు.

​రూ.2 లక్షల రుణమాఫీ హామీని ఏ ఒక్క గ్రామంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రఘునాథపాలెం మండలంలో ఏ గ్రామానికైనా వచ్చి చర్చించే ధైర్యం ఉందా అని పువ్వాడ బహిరంగ సవాలు విసిరారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూ.75,000 వరకు బాకీ పడ్డారన్నారు.

కళ్యాణలక్ష్మిలో తులం బంగారం, రూ.4,000 పింఛన్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించిన కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. రైతాంగం, ప్రజా సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసా రామారావు, ఆర్జేసీ కృష్ణ, గుత్తా రవి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>