కలం, ఖమ్మం బ్యూరో : పన్నెండేళ్ల బంధం.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు.. కానీ గత రెండు నెలలుగా ఆ ఇంట్లో సాగుతున్న మనస్పర్ధలు, కుటుంబ కలహాలు చివరికి భర్త ప్రాణాలను బలితీసుకున్న ఘటన ఖమ్మం (Khammam) లో చోటుచేసుకుంది. భార్యతో గొడవల నేపథ్యంలో అత్తగారింటికి వెళ్లిన భర్త, అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అయితే తన కుమారుడి మరణంపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని మృతుడి తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసు కథనం ప్రకారం.. పాండురంగాపురం గ్రామానికి చెందిన శనిమల వెంకటేష్ (35) గ్రానైట్ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 12 ఏళ్ల క్రితం స్వప్నతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత రెండు నెలలుగా భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన స్వప్న తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఖమ్మంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు (9వ తేదీన) వెంకటేష్ కూడా అత్తగారింటికి వెళ్లాడు.
అక్కడ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో వెంకటేష్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మరణ వార్త విన్న మృతుడి తల్లి శనిమల లక్ష్మి (50) ఆదివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
భార్యాభర్తల గొడవల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నప్పటికీ, తన కుమారుడి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని లక్ష్మి ఆరోపించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వెంకటేష్ అత్తగారింటికి వెళ్లిన సమయంలో అసలు ఏం జరిగింది, అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి, కుటుంబ కలహాలకు గల కారణాలేమిటి అనే పలు కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

