గణేష్‌ ఉత్సవాలు, నేరాల నియంత్రణపై సీపీ కీలక ఆదేశాలు

కలం, కరీంనగర్: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ (Karimnagar CP Gaush Alam) ఆలం తెలిపారు. కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ఆగస్టు నెల నెలవారీ నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్‌ కేసులు, కోర్టు కేసులు, సైబర్‌ నేరాలు, మహిళలు–చిన్నారుల భద్రత, డ్రగ్స్‌, ట్రాఫిక్‌ తదితర అంశాలపై సమీక్షించారు.

గణేష్‌ ఉత్సవాలపై ప్రత్యేక చర్యలు:

మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట తదితర నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్‌, గజ ఈతగాళ్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రూట్‌ మ్యాప్‌ అమలు చేయాలని, సోషల్‌ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

నేర నియంత్రణపై సమీక్ష:

నేరం జరిగిన వెంటనే శాస్త్రీయ ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

మహిళలు, చిన్నారుల భద్రత:

మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా POCSO, అత్యాచారం, ఇతర మహిళా సంబంధిత కేసుల్లో కోర్టు విచారణ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సైబర్‌ నేరాల నియంత్రణ:

సైబర్‌ నేర బాధితులకు వీలైనంత త్వరగా నగదు రికవరీ చేయడంతో పాటు, మోసాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. CEIR ద్వారా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల రికవరీని వేగవంతం చేయాలని సూచించారు.

డ్రగ్స్‌, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం:

మాదకద్రవ్యాలు, గుట్కా, పేకాట, అక్రమ ఇసుక రవాణా తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 4,268 కేసుల పరిష్కారం:

సెప్టెంబర్‌ 12న నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 4,268 కేసులు పరిష్కరించబడ్డాయి. ఇందులో 451 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, 1,019 ప్రమాద/ఇతర సంబంధిత కేసులు, 2,798 మోటార్‌ వెహికల్‌ కేసులు, 34 సైబర్‌ కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులు పరిష్కరించిన కరీంనగర్‌ ట్రాఫిక్‌–685, కరీంనగర్‌–I టౌన్‌–495 పోలీస్‌ స్టేషన్లతో పాటు కేసుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను సీపీ అభినందించారు.

ప్రజలు, ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి:

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని, పోలీస్‌ శాఖకు ప్రజలు మరియు ఉత్సవ కమిటీలు సంపూర్ణ సహకారం అందించాలని సీపీ గౌష్‌ ఆలం కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ పి. కృష్ణమూర్తి, ఏసీపీలు, సీఐలు, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>