కలం, జోగులాంబ గద్వాల: ముక్కోటి దేవతల తొలి పూజలందుకునే లంబోదరుడు భక్తులను ఆశీర్వదించేందుకు సిద్ధమవుతున్నాడు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్స వాల సందడి నెలకొంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కాబోతుండగా.. తొలి పూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏకదంతుడి మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
కిటకిటలాడుతున్న మార్కెట్..
గద్వాల పట్టణంలో గణేష్ విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం ఎక్కడ చూసినా వినాయక విగ్రహాల తరలింపులే కనిపించాయి. పట్టణంతో పాటు గ్రామాల్లోని మండపాల నిర్వాహకులు గణపతి విగ్రహాల కొనుగోళ్లలో బిజీగా మారారు. గద్వాల పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాల్లో రద్దీ నెలకొంది. మట్టితో తయారు చేసిన వినాయకులను కొనుగోలు చేసేందుకు సైతం మండలపాల నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో విగ్రహం ఖరీదు రూ.2 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
పూజా సామగ్రి కొనుగోళ్లు..
గద్వాల జిల్లా కేంద్రంతో పాటు అయిజ, అలంపూర్ పట్టణాల్లో పూజా సామగ్రి కొనుగోళ్ల సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పట్టణాలకు చేరుకుని సామగ్రిని కొను గోలు చేస్తున్నారు. గద్వాల పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్, రాజీవ్ సర్కిల్, పాత బస్టాండ్, గాంధీ చౌక్ తదితర మార్కెట్ వీధులు జనంతో రద్దీగా కనిపించాయి. రాజ వీధి, పాత బస్టాండ్ రోడ్డులో వస్త్ర దుకాణాల్లో రద్దీ విపరీతంగా ఉంది. పండగ నేపథ్యంలో పూల ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో చామంతి పూలురూ.500, బంతి పూలు 200, చిట్టి రోజాలు రూ.400, కనకాంబరాలు రూ.500 ధర పలుకుతోంది. అరటి, పచ్చి సీతాఫలాలు, వెలక్కాయలు, మామిడి ఆకులు, జామకాయలు రెట్టింపు ధరలతో విక్రయిస్తున్నారు.
మండపాల ఏర్పాట్లు పూర్తి..
గద్వాల జిల్లాలో గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాట్లు పూర్తి చేశారు. వెదురు తడికెలతో మండపాలు నిర్మించి, వాటిపై వర్షం పడకుండా ప్లాస్టిక్, టార్పాలిన్లు కప్పారు. లోపల ప్రత్యేక ఆకర్షణగా పలుచటి సిల్క్ వస్త్రాలతో తెరలు కట్టి వాటికి అదనపు ఆకర్షణగా రంగుల కాగితాలు, బెలూన్లు, ప్లాస్టిక్ డెకొరేటెడ్ సామగ్రిని ఏర్పాటు చేశారు. మిరిమిట్లు గొలిపేలా విద్యుత్తు దీపాలు అమర్చారు. ఓం, స్వస్తిక్, గణపతయే నమః అనే అక్షరాలతో విద్యుత్తు దీపాలను వెలిగించారు.
భారీగా పెరిగిన దుకాణాలు…
గద్వాల పట్టణంలో గతంలో కొన్ని చోట్ల మాత్రమే విక్రయాలు జరిగేవి. ఈసారి మాత్రం బండ్ల మీద వందల కొద్దీ మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన చిన్న విగ్రహాలు అమ్మకానికి పెట్టారు. రూ.100 నుంచి రూ.30వేల వరకు ధర పలికే విగ్రహాలు అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. ముందస్తు బుక్ చేసినవారితో పాటు అప్పటికప్పుడు వచ్చి కొనుగోళ్లు చేసుకుని తీసుకెళ్తున్నారు. రేపు ఉదయం వరకు కూడా విక్రమాలు కొనసాగే అవకాశం ఉంది.
అనుమతి పత్రాలు ఉండాలి..
గణేష్ మండపాలకు సంబంధించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. నిర్వాహకులు డౌన్లోడ్ చేసుకొని మండపాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం మంజూరు చేస్తున్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్తు, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆన్లైన్ అనుమతి పత్రం చూపాలి.
ప్రశాంతంగా ఉత్సవాలు: టి.శ్రీనివాస రావు, జిల్లా ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా నిర్వాహకులు దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలిపారు. మండపాలకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించేలా కమిటీ సభ్యుల సహకరించాలని సూచించారు.

