కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Delhi Fire Accident) చోటుచేసుకుంది. గలీ నంబర్ 2లోని ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖస్రా నంబర్ 357/58లో ఉన్న భవనంలోని గ్రౌండ్, మొదటి అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సదరు ఫ్యాక్టరీలో జూడో దుస్తులు, బాక్సింగ్ గ్లోవ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భయంతో భవనం నుంచి దూకిన ఆరుగురు..
ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన సమయంలో ఎదురుగా ఉన్న భవనంలోని కొందరు నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో కొందరు భవనం నుంచి కిందకు దూకడంతో ఆరుగురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనలో మరో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.
మంటలు అదుపులోకి..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 15 ఫైర్ టెండర్లను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు, నష్టం వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

