కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణలో ఆధిపత్య కులాల అధికారం ఇంకా ఎన్నాళ్లు.. అని ఉద్యమ కారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన చారిత్రాత్మక ఘట్టమని.. ప్రజలు రక్తాన్ని ధారబోసి సాధించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. ఆధిపత్య కులాల అధికారమే ఇంకా కొనసాగడం ప్రజల దురదృష్టం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు పీడిత ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని, యావత్ సమాజం ఆశించిందన్నారు. నేటికీ సామాన్యుడి బతుకు ఏమాత్రం మారలేదన్నారు.
నియోజకవర్గానికో ఫామ్‌హౌస్..
తెలంగాణ రాగానే మొదటి ఆధిపత్య కులం అధికారాన్ని చేజిక్కించుకొని, ఫామ్‌హౌస్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందని హనీఫ్ అహ్మద్ విమర్శించారు. వేల ఎకరాల భూములు కొట్టేసి బినామీల ఖాతాల్లోకి మళ్లించారని దుయ్యబట్టారు. నియోజకవర్గానికో ఫామ్‌హౌస్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని, ప్రశ్నించిన ఉద్యమకారులు, మేధావులు, రైతులు, విద్యార్థులను జైళ్లల్లో బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేని వారికి పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు.
మూడేళ్లవుతున్నా అమలు కాని హామీలు..
బీఆర్ఎస్ నియంతృత్వానికి స్వస్తి చెప్పి.. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నా పరిస్థితి మారలేదని హనీఫ్ అహ్మద్ ఆరోపించారు. నామినేటెడ్ పదవులు, కీలకమైన ఉన్నతాధికారుల పోస్టింగ్‌లు, నిర్ణయాధికారాలు మళ్లీ ఆధిపత్య వర్గం చేతుల్లోనే బందీ అయినట్లు మండిపడ్డారు. మూడేళ్లవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు కావడం లేదన్నారు.
ఆధిపత్య కులాల రాజ్యాధికార డ్రామాలను ప్రజలు ఇకనైనా గమనించాలని హనీఫ్ అహ్మద్ కోరారు. జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు ఆధిపత్య వర్గాలకు సేవ చేయడం మానుకోవాలన్నారు. ఆ వర్గాలకు పాలన చేసినప్పుడే తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.

