కలం, కరీంనగర్: కరీంనగర్ నగరం డివిజన్ అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్ లోని కాశ్మీర్ గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నిర్మాణ పనుల సమయంలో స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. గతంలో 42వ డివిజన్ ఏ విధంగానైతే సమస్యలు లేని డివిజన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందో, అదే విధంగా కొత్తగా డివిజన్‌లో కలిసిన అన్ని ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
డివిజన్ లో కొత్తగా కలిసిన వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించి, స్థానిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని సునీల్ రావు తెలిపారు. జిల్లా పరిషత్ క్వార్టర్స్ వద్ద ఉన్న పార్కును త్వరలోనే అధునాతన రీతిలో అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు పునరంకితం చేయనున్నట్లు వెల్లడించారు. డివిజన్ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి.చంద్రమౌళి మరియు శ్రీధర్, అశోక్, వినోద్ కుమార్, విజయ భాస్కర్, ఖాదర్ ఫారుకి, ఇబ్రహీం, తబ్రేజ్, షారుక్, మహమ్మద్ ఆబిద్ డివిజన్ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

